ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేస్తున్న సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉజ్వల భవితకు పెట్టుబడి లాంటిదని, ఆయన అందిస్తున్న ఆర్థిక సహకారంతో ప్రతి ఒక్కరూ అభివృద్ది సాధించాలని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏఎస్ పేట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్ ఆసరా సంబరాల్లో భాగంగా పొదుపు మహిళలకు 3వ విడత ఆసరా జమ చేసిన నమూనా చెక్ ను ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి అందచేశారు. తొలుత ఏఎస్ పేటకు వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అందరిని పేరుపేరున పలకరిస్తూ ఎమ్మెల్యే సభా స్థలికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పొదుపు మహిళలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అందచేస్తున్నారని అన్నారు. తాను 10 నెలలుగానియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఈ విషయం స్వయంగా తెలుసుకుంటున్నాని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఓ బృహత్తర కార్యక్రమమని, సంక్షేమ పథకాలను అందచేస్తూనే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.
అభివృద్ది, ప్రజాసమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల గుర్తింపు అన్ని ఈ కార్యక్రమం ద్వారా జరుగుతున్నాయని వివరించారు. తమ కుటుంబంలో తమ తాత మునిసిఫ్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో తన తండ్రి, నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి చదువుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారని, చదువుకోవడానికి వెళ్లేందుకు కిలోమీటర్ల మేర వెళ్లేవారని, అయినా పట్టుదలతో చదివి అందరికి ప్రస్తుతం ఉన్నతస్థాయిలో చూసుకుంటున్నారని అన్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించి విద్య, వైద్యం, వ్యవసాయం పట్ల ప్రోత్సహిస్తున్నారని, ప్రతి ఒక్కరిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా తన బాధ్యతగా చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మరోమారు ప్రజలంతా కలసి ఆశీర్వదించాలని ఆయన కోరారు.