చిన్నారుల లేత మనసులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ సీఎఫ్) ముసాయిదా కీలక సిఫారసు చేసింది. రెండో తరగతి వరకు ఎలాంటి రాత పరీక్షలను వారికి నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చింది. రాత పరీక్షలను కేవలం మూడో తరగతి నుంచే ఆరంభించాలని సూచించింది. పిల్లల్లో విద్యాభ్యాస సామర్థ్యాలను పరీక్షించే విధానాలు ఏవైనా కానీ, వారిపై అదనపు భారాన్ని మోపే విధంగా ఉండకూడదని అభిప్రాయపడింది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ ముసాయిదాను రూపొందించారు.
ఆరంభ తరగతుల్లోని చిన్నారుల విద్యా సామర్థ్యాలను అంచనా వేసేందుకు రెండు రకాల విధానాలను సూచించింది. పిల్లలను పరిశీలించడంతోపాటు, పిల్లలు వారి అభ్యాస ప్రక్రియలో భాగంగా రూపొందించిన వస్తువులను విశ్లేషించాలని సూచించింది. ప్రీ స్కూల్ నుంచి రెండో తరగతి వరకు పరీక్షలు నిర్వహించడం అన్నది తగిన మూల్యాంకన పద్ధతి కాదని తేల్చి చెప్పింది.
‘‘పిల్లలు ఎవరికి వారే భిన్నంగా నేర్చుకుంటారు. వారు నేర్చుకున్నది భిన్నంగా వ్యక్తీకరిస్తారు. పిల్లలు నేర్చుకునే సామర్థ్యాలను అంచనా వేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి టీచర్లే వివిధ రకాల మదింపులను రూపొందించుకోవాలి. మూల్యాంకనం ఏదైనా కానీ, అది పిల్లల అభ్యాసంలో వైవిధ్యానికి అవకాశం కల్పించాలి’’ అని ముసాయిదా పేర్కొంది.