కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు నిర్వహించగా.. ఓ అర్చకుడి నివాసంలో జింక చర్మం చూసి షాకయ్యారు. ఆలయంలోని ప్రసాదాలు తయారుచేసే పోటు, గిడ్డంగి, అన్నదాన సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆలయ ఈవో వెంకటేశు ఆధ్వర్యంలో సిబ్బంది నివాసాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. వరసిద్ధి వినాయకస్వామి అనుబంధ ఆలయమైన వరదరాజులస్వామి ఆలయ అర్చకుడు కృష్ణమోహన్ నివాసంలో జింకచర్మాన్ని గుర్తించారు. ఈ విషయం గురించి అటవీశాఖ అధికారులకు ఈవో వెంకటేశు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు.
డీఎఫ్‌వో చైతన్య కుమార్‌రెడ్డి ఆదేశాలతో జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు.. కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ద్వారా జింకచర్మాన్ని తాను కొనుగోలు చేసినట్టు విచారణలో కృష్ణమోహన్ వెల్లడించారని, విక్రయించిన నిందితుడి కోసం గాలిస్తున్నామని ఎఫ్‌ఆర్వో బాలకృష్ణారెడ్డి తెలిపారు.
శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ అన్నసత్రం, గిడ్డంగి, పోటుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో వారి ఇళ్లలో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, ఈవో ఎ.వెంకటేశు శనివారం వేకువజాము నుంచి దాడులు చేశారు.
నలుగురు వంట మనుషుల ఇళ్లలో పెద్దఎత్తున బియ్యం బస్తాలు, ఇతర సామాగ్రిని గుర్తించారు. చినకాంపల్లెకు చెందిన అన్నదాన సత్రంలో పనిచేస్తున్న ఓ మహిళ, గొడౌన్, పోటులో పనిచేసే వారి ఇళ్లలో బియ్యం, చక్కెర, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రోజూ 2,500 మందికి సరిపడా అన్నదానానికి కావాల్సిన సరకులు, సేవల ప్రసాదాలకు గిడ్డంగి నుంచి ముందురోజు సామాగ్రి తీసుకెళ్తారు. వాటిలో కొన్నింటిని ఇళ్లకు తరలిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో ఈవో రహస్యంగా అన్నదాన భవనం వద్ద మాటువేసి.. సరకులు తరలిస్తున్న బైక్‌ను వెంబడించారు. వంటమనిషి ఇంటికి వెళ్లి పరిశీలించి, సరకులు గుర్తించారు.
మిగితావారి నివాసాల్లో తనిఖీ చేసి రూ.1.30 లక్షల విలువైన సరకులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు సిబ్బంది ఇళ్లలో సరుకులను స్వాధీనం చేసుకున్నామని ఈవో వెంకటేశు తెలిపారు. వారిపై కఠినచర్యలు తీసుకుంటామని, పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.