జమ్మూ కశ్మీర్ పర్యటనలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు అదుపుతప్పి బలంగా ఢీకొట్టంది. భద్రత సిబ్బంది తక్షణమే స్పందించడంతో ప్రమాదం తప్పింది. రామ్‌బన్ జిల్లా బనిహాల్ వద్ద జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లో శనివారం నిర్వహించిన ఓ న్యాయసేవా కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ నుంచి శ్రీనగర్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించారు.
ఆయన కారును ఉదంపూర్ సమీపంలో లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. ట్రక్కు బ్రేక్‌డౌనుకు గురికావడంతో ఇలా జరిగిందని అదనపు డీజీ ముకేశ్‌సింగ్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది మెరుపువేగంతో స్పందించి కారు డోర్లు తెరిచి మంత్రిని బయటకు తీశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఉదంపూర్ వరకు కారులో వెళ్లారు. ఈ సమయంలో తీసిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. యాదృచ్ఛికంగా వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
‘‘ఈ అందమైన రహదారిని తమ ప్రయాణంలో ఎవరైనా ఆస్వాదించవచ్చు’’ అంటూ విశాలమైన రోడ్డును చూపిస్తూ తీసిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసి క్యాప్షన్ పెట్టారు. ట్రక్కు ఢీకొట్టిన వెంటనే నలుపు రంగు స్కార్పియో డోర్లు తెరిచి కేంద్ర మంత్రిని భద్రతా సిబ్బంది బయటకు తీస్తుండటం.. ఆయన చుట్టూ భారీ సంఖ్యలో సైనికులు ఉండటం వీడియోలో కనిపిస్తోంది. ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, కేంద్ర మంత్రి కారుకు స్వల్ప ప్రమాదం జరిగిందని జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.