ఈ నెల 2న శ్రీకాకుళం జిల్లా, పెదరావుపల్లి సమీపంలోని గెడ్డలో హత్యకు గురైన మురపాక గ్రామానికి చెందిన గణమాన రాము కేసును పోలీసులు ఛేదించారు. ఇతని భార్యతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్ళితే.... మురపాక గ్రామానికి గనమాన రాము(35)కు అదే గ్రామానికి చెందిన కుమారితో కొన్నేళ్ల కిందట వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే వీరిది పేద కుటుంబం కావడంతో కుమారి భవన నిర్మాణ పనులకు శ్రీకాకుళం వెళ్లేది. ఈ క్రమంలో శ్రీకాకుళానికి చెందిన దారపు ప్రసాద్‌తో కుమారి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త రాముకు తెలిసిపోయింది. దీంతో తరచూ తనను అనుమానిస్తున్నాడని, ఎలాగైనా భర్తను చంపేయాలని ప్రియుడు ప్రసాద్‌కు కుమారి చెప్పింది. రాముని హత్య చేసేందుకు ప్రసాద్ శ్రీకాకుళానికి చెందిన కోండ్రు సతీష్‌కుమార్, బాగు కిరణ్ సహకారం కోరాడు. వీరు గతనెల 31న అల్లినగరం నుంచి మురపాకకు వెళ్లే రహదారి మధ్యలో బయ్యన్నపేట జంక్షన్‌లోని బస్సు స్టాప్ వద్ద రాము కోసం వేచి చూశారు. అయితే, ఆ రోజు రాము పనికి వెళ్లలేదు. దీంతో ఈ నెల 2న మురపాక సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రాము కోసం కాపుకాశారు. రాము ఎప్పటిలాగానే వేకువజామున తన ద్విచక్ర వాహనంపై రణస్థలం కూలి పనులకు వెళ్తుండగా ప్రసాద్, సతీష్‌కుమార్, కిరణ్ కలసి ద్విచక్ర వాహనంతో వెంబడించారు. పెదరావుపల్లి గెడ్డవద్దకు చేరే సరికి రాము బైక్‌ను ఢీకొన్నారు. దీంతో రాము రోడ్డుపై పడి పోగా, అతన్ని ఈ ముగ్గురు కలిసి పక్కనే ఉన్న గెడ్డలోకి ఈడ్చుకెళ్లి రాము గొంతు నులిమి హతమార్చారు. ఈ కేసులో రాము భార్య కుమారితో పాటు ప్రసాద్, సతీష్‌కుమార్, కిరణ్‌ను పోలీసులు సోమవారం 10న అదుపులోకి తీసుకుని, మంగళవారం విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. తొలుత రాముది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, అయితే పోస్టుమార్టం రిపోర్టులో హత్యగా తేలడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు.