ఇటీవల కాల్పుల్లో మరణిాంచిన అతిక్ అహ్మద్ రాసినట్టు చెబుతున్న ఓ 'రహస్య లేఖ'ను అతని న్యాయవాది సోమవారం బయటపెట్టారు. అతిక్ అహ్మద్ హత్యకు సరిగ్గా రెండు వారాల ముందు.. భారత సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తనను ఎవరైనా హత్య చేస్తే.. ఆ లేఖను సుప్రీంకోర్టుకు అందజేయాలని అతిక్ కోరినట్టు అతని లాయర్ వెల్లడించారు. అందుకే దాన్ని అపెక్స్ కోర్టుకు సమర్పిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను శనివారం రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో ముగ్గురు వ్యక్తులు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. ఉమేష్ పాల్ హత్య కేసుకు సంబంధించి.. కోర్టు విచారణ కోసం గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చిన సమయంలో.. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే వారిని కాల్చి చంపారు. ఈ మర్డర్ ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
హత్యకు ముందు మార్చి 26న గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి బయటికి వస్తున్న సమయంలో.. అతిక్ అహ్మద్ విలేకరులతో మాట్లాడారు. అప్పుడు.. తాను ఎన్‌కౌంటర్‌లో చనిపోతాననే భయాన్ని వ్యక్తం చేశాడు. కోర్టు విచారణ కోసం తనను ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లొద్దని.. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. తనను ఫేక్ ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారని భయాందోళన వ్యక్తం చేశారు. అన్నట్టే.. ఆయన్ను పబ్లిక్‌గా కాల్చి చంపారు. అయితే.. తాజాగా బయటకు వచ్చి లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
'జైలులో కొందరు పోలీసు అధికారులు తనను బెదిరించారని అతిక్ నాతో చెప్పాడు. ఓ అధికారి అతన్ని చంపుతానని బెదిరించాడు. అన్ని వివరాలు లేఖలో ఉన్నాయి' అని అతిక్ లాయర్ వివరించారు. అయితే.. అతిక్ ఆ లేఖ ఎవరికి రాశారు.. ఎప్పుడు రాశారు.. ఎందుకు రాశారు.. చంపుతారని తనకు ముందే తెలుసా.. సుప్రీంకోర్టుకు ఇవ్వాలని ఎందుకు చెప్పాడు.. అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.