రైతు దంపతులు తమ జీవితాలను అంతం చేసుకోవడానికి అత్యంత భయంకరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం తమ పొలం వద్ద గిలెటిన్ తరహా సాధనాన్ని తయారు చేసుకున్నారు. ఫ్రెంచి విప్లవ కాలంలో మరణశిక్ష వేసిన వారిని సామూహికంగా తలలు తెగవేసేందుకు కనిపెట్టినన ఒక యంత్ర సాధనమే గిలెటిన్. ఈ దంపతులు గిలెటిన్ బ్లేడ్‌లను స్వయంగా పైకి లాగి, అది వారి తలలు కట్ చేసే విధంగా వదులుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. తెగిపడిన తమ తలలు అక్కడే ఏర్పాటు చేసుకున్న మంటల్లో పడిపోయేలా ఏర్పాటు చేసుకున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని వించియా గ్రామంలో ఆదివారం (ఏప్రిల్ 16) ఈ ఘటన చోటు చేసుకుంది.
రైతు, అతడి భార్య తమ పిల్లలను వారి మేనమామ ఇంటికి పంపించిన తర్వాత తమ జీవితాలను ముగించారు. ఇది ఏదైనా మూఢనమ్మకమా? లేక మంత్రతంత్రాల ఆచారంలో భాగమా? లేదా ఆత్మహత్యలా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సంఘటనా స్థలం నుంచి పోలీసులు.. గుజరాతీలో రాసిన ఓ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమకు తామే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని ఆ నోట్‌లో పేర్కొన్నారు. వారి బొటనవేలితో ముద్రలు కూడా వేశారు.
మృతులను హేము మక్వానా (38), అతడి భార్య హంసా మక్వానా (35)గా పోలీసులు గుర్తించారు. మేనమామ ఇంటి నుంచి తిరిగొచ్చిన ఈ దంపతుల కుమారుడు (13 ఏళ్లు), కుమార్తె (12 ఏళ్లు) వారి వ్యవసాయ పొలం వద్ద తలలు తెగి పడి ఉన్న మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను ఫోరెన్సిక్ పోస్టుమార్టం నిమిత్తం రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రికి తరలించారు.
ఏడాది కాలంగా ఈ దంపతులు అక్కడికి సమీపంలో ఏర్పాటు చేసిన ఓ శివాలయంలో పూజలు చేస్తున్నారని వించియా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రజిత్‌సింగ్ జడేజా తెలిపారు. ఆహార ధాన్యాల ప్యాకింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్ సంచులతో అక్కడ తాత్కాలిక ఆలయాన్ని నిర్మించారు. మట్టితో తయారు చేసిన శివలింగాన్ని అక్కడ ఉంచి పూజలు చేస్తున్నారని తెలిపారు.
దంపతుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. కొంత కాలంగా హంసా ఆరోగ్యం బాగా లేనట్లు తెలుస్తోంది. తన అన్నాదమ్ములు, తన అత్తామామలు తనను ఎప్పుడూ మందలించలేదని, ఇబ్బంది పెట్టలేదని నోట్‌లో హేము పేర్కొన్నారు. వారికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, కుటుంబ కలహాలు కూడా లేవని హంస కజిన్ జయంతి తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని, ఏ వాదననూ తోసిపుచ్చడం లేదని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులందరి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తున్నామని ఎస్సై జడేజా వెల్లడించారు.