గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్యల కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులోని నిందితులు అత్యాధునిక ఆయుధాలను వాడినట్లు పోలీసులు గుర్తించారు. తుర్కియే కంపెనీ ‘టిసాస్’తయారుచేసిన సెమీ-ఆటోమేటిక్ ‘జిగాన’తుపాకితో కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. తుర్కియేలో పాలిమర్ ఫ్రేమ్‌తో తయారైన తొలి పిస్తోల్ ఇదే. ఒక్కోటీ రూ.ఆరు లక్షలకు పైగా ఖరీదు చేసే ఈ తుపాకులను అక్కడి సైన్యం, ప్రత్యేక దళాలు, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు వాడుతున్నాయి. అయితే, భారత్‌లో మాత్రం వీటిని నిషేధించారు.
కొన్నేళ్ల కిందట గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఢిల్లీలో తన కార్యకలాపాల కోసం 2020 పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌లార్డ్ జితేందర్ గోగితో చేతులు కలిపాడు. ఈ సందర్భంగా స్నేహానికి చిహ్నంగా జిగానా పిస్టల్‌ను గోగికి బహుమతిగా ఇచ్చాడు. తుపాకిని మెచ్చిన గోగి అలాంటి పిస్టల్స్ కోసం ఆర్డర్ ఇచ్చాడు. మార్చి 2020లో ఢిల్లీ పోలీసులు గోగితో పాటు అతని అనుచరులు కుల్దీప్ ఫజ్జా, రోహిత్ మోయిలను అరెస్టు చేశారు. అప్పుడు మూడు జిగానా పిస్టల్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ టర్కిష్ పిస్టల్స్ ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ల పరిధిలో ఉన్నాయని మొదటిసారి పోలీసులు ధ్రువీకరించారు.
మరోవైపు, పాకిస్థాన్ నుంచి వీటిని దేశంలోకి అక్రమంగా రవాణా తీసుకొస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అచ్చం జిగానా మాదిరి తుపాకులను పాకిస్థాన్‌లో తయారు చేస్తున్నారు. నాణ్యతలో తుర్కియే పిస్టల్స్‌తో సరిపోకపోయినా.. ధర మాత్రం తక్కువ ఉంటుంది. పాకిస్థాన్‌లో ‘గన్ వ్యాలీ’గా పేరున్న ‘దర్రా ఆదమ్ ఖేల్’ అనే ప్రాంతంలో దాదాపు 2,000 ఆయుధ షాపులు ఉన్నాయి. జిగానా తుపాకులు అత్యంత నమ్మదగనివే కాదు.. మిగిలిన అధునాతన ఆయుధాల కంటే తక్కువ ధరలో లభిస్తాయి.
సాధారణంగా ఆయుధ నిపుణులకు మాత్రమే తెలిసే ఇటువంటి తుపాకులను అతీక్ అహ్మద్ సోదరుల హంతకులు వాడటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతోపాటు ఇంత ఖరీదైన తుపాకులు కొనేంత ఆర్థిక సామర్థ్యం కూడా వారికి లేదు. ఈ హంతకులు ముగ్గురూ పేద కుటంబాల నుంచి వచ్చిన వారే.
గ్యాంగ్‌స్టర్స్‌లో జిగానాకు మంచి డిమాండ్ ఉంది. ఈ ముఠాలను ట్రాక్ చేసిన పరిశోధకులు పిస్టల్స్ ఖరీదైనవి మాత్రమే కాకుండా, సేకరించడం కూడా కష్టమని చెప్పారు. ‘ఈ రోజుల్లో క్రైమ్ సిండికేట్‌లు అటువంటి ఆయుధాలను ఉపయోగించడం మరింత స్టేటస్ సింబల్‌గా మారాయి. ఇది వారి స్థానాన్ని పెంచుకోవడమే కాకుండా చాలా శక్తివంతంగా.. కనెక్ట్ అయిందనే తప్పుడు భావాన్ని కూడా సృష్టిస్తుంది’ గ్యాంగస్టర్ గోగీని అరెస్టు చేసిన బృందంలోని ఒక అధికారి అన్నారు.
ఒకానొక సమయంలో గోగి ఈ పిస్టల్స్ కోసం దోపిడీల ద్వారా సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం ఖర్చుచేశాడని తెలిపారు. రూ.4-7 లక్షల మధ్య ఖరీదు చేసే ఈ పిస్టల్స్‌ను టాప్ గ్యాంగ్‌స్టర్లు మాత్రమే కొనుగోలు చేయగలరని స్పెషల్ సెల్‌కు చెందిన మరో అధికారి తెలిపారు. ‘బ్లాక్ మార్కెట్‌లో వీటి కోసం రూ. 10-12 లక్షల వరకు ఖర్చు చేయడానికి వెనుకాడరు’ అని ఆయన చెప్పారు.
గ్యాంగ్‌స్టర్లు ఈ ఆయుధాలు కాల్చే విధానానికి ఆకర్షితులవుతున్నారు. ‘జామ్ కావడం లేదా లాక్ కావడం జరగదు.. ఒకేసారి 15-17 రౌండ్లు కాల్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.. కాల్చినప్పుడు పెద్ద శబ్దం కూడా రాదు.. దీని పనితీరు ధరకు తగినట్లుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతీక్ సోదరులను హత్య చేసిన హంతకుల్లో ఒకడైన సన్నీకి పశ్చిమ యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ సుందర్ భాటితో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. ఈ హత్యకు వాడిన జిగాన తుపాకులు సుందర్ నుంచే సన్నీకి చేరినట్లు అనుమానిస్తున్నారు.