వివేకా హత్య వ్యవహారంలో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కల్పిత అంశాలు, కట్టుకథలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీళ్ల వరుస చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వివేకా హత్యకేసు అజెండాతో ప్రజల్లోకి వెళ్లేట్టు కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ఎల్లో మీడియా తాపత్రపడుతోందని సజ్జల విమర్శించారు. దస్తగిరితో మాట్లాడిస్తోంది వీళ్లేనేమో అనిపిస్తోందని, అందుకే దస్తగిరి చెప్పిన మాటలనే పతాక శీర్షికలుగా పెడుతున్నారని వెల్లడించారు. "టీడీపీ ఎంత దిగజారిపోయిందో దీన్ని బట్టే అర్థమవుతోంది. టీడీపీ ఇవాళ ప్రజలు లేరు... ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవు... సీఎం జగన్ ను ఎదుర్కోవడానికి ఏం చేస్తారో చెప్పుకోవడానికి ఏమీ లేదు.
కుటుంబంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత వివేకానందరెడ్డే పెద్ద దిక్కుగా ఉన్నారు. నాడు ఇంట్లో ఒత్తిడి వల్లో, మరే కారణం వల్లో కాంగ్రెస్ నుంచి బయటికి రాలేకపోయినా, తన తల్లిపై పోటీ చేసినా జగన్ సాదరంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. వివేకానంద గారు కడప జిల్లాలో వైసీపీకి అన్నింటికి తానే ముందుండి, అవినాశ్ రెడ్డి, తదితర నేతలతో ముందుకు సాగారు. జగన్ కుటుంబంలో అయితే వివేకానే పెద్ద దిక్కు. అంతటి బాధాకరమైన సంఘటన జరిగితే, నిందితులే వీళ్లేనంటూ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. నాడు వైఎస్సార్ పై ఇదే ప్రయోగం చేశారు... ఇప్పుడు జగన్ పై దాడి చేస్తున్నారు" అని సజ్జల వ్యాఖ్యానించారు.