రాష్ట్రంలో ఏ అంశంపైన అయినా ప్రజా వ్యతిరేకత వచ్చిందంటే చాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ప్రయోగిస్తాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట అనే కుగ్రామాన్ని మహానగరంగా చేస్తామనడం ప్రజలను మభ్యపెట్టడమేనని చెప్పారు. ఏ విధంగా రాజధానిని విశాఖకు తీసుకెళతారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డిపైన వస్తున్న ఆరోపణలు డైవర్షన్ చేయడానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిని విశాఖకు తీసుకెళుతున్నామని చెబుతున్నారన్నారు. శ్రీకాకుళంలో ఉన్న మూలపేట గ్రామాన్ని ముంబై, చెన్నైలా మహానగరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మూలపేట అనేది ఒక కుగ్రామమని, అది అభివృద్ధి చేయాలంటే దాదాపు 200 సంవత్సరాలు పడుతుందన్నారు. ఏ విధంగా రాజధానిని విశాఖపట్టణానికి తీసుకెళతారని ప్రశ్నించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు పెండింగు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి అప్పుడప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. కడప ఉక్కు పరిశ్రమకు ఎన్నిసార్లు పునాది రాళ్లు వేశారో గుర్తు చేసుకోవాలని సూచించారు. మరి కడపను ఏమైనా దుబాయ్‌లా ముఖ్యమంత్రి మారుస్తారా అని ప్రశ్నించారు.