యువగళం పేరుతో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ఇదిలావుంటే యువగళం పాదయాత్ర 1000 కి.మీ మైలురాయి చేరుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనకు వెన్నంటి నిలచిన యువగళం సైనికులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనవరి 27న పాదయాత్ర ప్రారంభం నుంచి వివిధ కమిటీలు క్రమశిక్షణతో యాత్ర సజావుగా సాగేలా అహర్నిశలు పనిచేస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా తాను చేస్తున్న చారిత్రాత్మక యువగళం పాదయాత్రలో అమోఘమైన రీతిలో సేవలందిస్తున్నారంటూ వివిధ కమిటీల సభ్యులు, వాలంటీర్లను లోకేశ్ పేరుపేరునా అభినందించారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.
లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను ముందుకు నడిపించడంలో 13 కమిటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. యువగళం ప్రధాన సమన్వయకర్త కిలారు రాజేశ్ నేతృత్వంలో ఈ కమిటీలు అనుక్షణం లోకేశ్ ను వెన్నంటి ఉండి యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందిస్తున్నాయి. వీరితోపాటు 100 మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ లోకేశ్ ను రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.