కడప ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీజేఐ చంద్రఛూడ్ ధర్మాసనం మధ్యంతర బెయిల్‌పై స్టే విధించింది. ఈ కేసు వివరాలు వింటామని.. సోమవారం మరోసారి విచారణ చేపడతామని.. అన్ని విషయాలూ అప్పుడు పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అదే క్రమంలో స్టే ఇస్తే అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందని లాయర్ ధర్మాసనానికి వివరించగా.. సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో సోమవారం జరిగే విచారణపై అందరి ఫోకస్ మారింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకముందే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలసిందే. ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. విచారణకు హాజరుకావాలని పేర్కొంది. దీంతో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. లాయర్లు తమ వాదనలు వినిపించారు.
'నాన్న అరెస్ట్ ఊహించలేదు.. మాటలు కూడా రావడం లేదు..'
తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించింది.. విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని సీబీఐని ఆదేశించింది. అయితే వివేకా కుమార్తె సునీతారెడ్డి అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సవాల్ చేశారు. సునీత తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్ధ లూద్రా వాదనలు వినిపించారు.
మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టైన వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. ఇటు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కూడా తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా కేసుతో ఎలాంటి సంబంధం లేకుండా సీబీఐ అరెస్ట్ చేసిందన్నారు. సీబీఐ దగ్గర కూడా తాము హత్య చేశామని ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సీబీఐ గూగుల్ టేక్ అవుట్ పేరుతో తమను అరెస్ట్ చేసిందన్నారు.