తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీంతో ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. అలాగే ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండదంటున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. వడగాలులు కూడా వీస్తున్నాయి. రాష్ట్రంలో కర్నూలు జిల్లా మంత్రాలయంలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 700కుపైగా ప్రాంతాల్లో 40 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐఎండి అంచనాల ప్రకారం శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రజలు విపత్తుల సంస్థ మెసెజ్ అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అల్లూరి జిల్లా 1,
అనకాపల్లి 14,
గుంటూరు 7,
కాకినాడ 7,
కృష్ణా 4,
ఎన్టీఆర్ 4,
పల్నాడు 1,
విశాఖపట్నం 1,
విజయనగరం జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. గురువారం అనకాపల్లి 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయి. మరో 51 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి. మరోవైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉందంటోంది వాతావరణశాఖ. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా ఈదురుగాలులు కూడా వీచాయి. మరో రెండు రోజుల పాటూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటున్నారు.
అటు వర్షాల సంగతి అలా ఉంటే.. తెలంగాణలో ఎండలు కూడా మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41- 44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. గురువారం 40-42 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.