పాకిస్తాన్ లో ప్రజల దుస్థితి నేటికి మారలేదు. అసలే ద్రవ్యోల్బణం.. ఆపై దెబ్బతిన్న పంటలు.. మరోవైపు ఉక్రెయిన్ - రష్యా యుద్ధం.. ఇవన్నీ ఇప్పుడు పాకిస్థాన్‌లోని పేదల పాలిట శాపంగా మారాయి. ఎంతలా అంటే.. పవిత్ర రంజాన్ మాసం వేళ కనీసం ఇఫ్తార్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. బియ్యం, పిండి, పండ్లు, మాంసం ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఉచితంగా పంపిణీ చేసే వారి కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఆదుకోకపోతే.. పవిత్ర రంజాన్ మాసంలో కూడా పస్తులు ఉంటున్నారు.
కరాచీలోని స్వచ్ఛంద సంస్థల గేట్‌ల వెలుపల వందలాది మంది పురుషులు, మహిళలు పడిగాపులు కాస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో తమ ఉపవాసాన్ని విరమించుకోవడానికి.. తగినంత పిండి, బియ్యం, పంచదార, వంట నూనెల కోసం చాలా మంది గంటల తరబడి కూర్చుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు పంపిణీ చేస్తే.. ఆ రోజు ఇఫ్తారు ఉంటుంది. లేకపోతే లేదు. అక్కడా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 12 మంది చనిపోయారు. 'ఇది మా జీవితంలో అత్యంత ఖరీదైన, భరించలేని రంజాన్' అని పాకిస్థాన్ ప్రజలు చెబుతున్నారు.
పాకిస్తాన్ అంతటా రంజాన్ సీజన్‌లో కాస్త ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా పండ్లు, మాంసం ధరలు పెరుగుతాయి. కానీ.. ఈ సంవత్సరం వస్తువుల ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. ఎంతలా అంటే.. గతేడాది రంజాన్ మాసంలో.. 20 కేజీల పిండి ధర రూ.1100 ఉంది. కానీ.. ఇప్పుడు 20 కేజీల పిండి ధర రూ.2800 అయ్యింది. ఆర్థిక సంక్షోభం ఈ స్థాయిలో ఉంది. దీంతో రోజువారీ ఉపవాసాన్ని విరమించుకోవడానికి అవసరమైన ఖర్జూరాలు, బియ్యం, మాంసం కొనడానికి లక్షలాది కుటుంబాలు కష్టపడుతున్నాయి. వేలాది మంది రంజాన్ వేడుకలకు దూరంగా ఉంటున్నారు.
గత నెలలో రంజాన్ మాసం ప్రారంభమైంది. అప్పటికే ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 35.4 శాతంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఐదు దశాబ్దాలలో ఇదే అత్యధికం. ద్రవ్యోల్బణానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల పాకిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పంటలు నాశనం అయ్యాయి. ముఖ్యంగా గోధుమ పంటలు దాదాపు దెబ్బతిన్నాయి. అవసరమైన ధాన్యాలను ఎగుమతి చేసే ఉక్రెయిన్.. ఇప్పుడు ఆ పరిస్థితిలో లేదు. మరోవైపు ఐఎంఎఫ్ 100 కోట్ల డాలర్లు సాయం చేస్తుందని పాక్ ఆశించింది. కానీ.. ఆ సాయం కూడా అందలేదు. ఇటు విదేశీ మారక నిల్వలు నిండుకున్నాయి.
ఇప్పుడే కాదు.. పాకిస్థాన్‌లో ధరల పెరుగుదల 10 నెలలుగా కొనసాగుతోంది. పెరుగుతున్న ధరలు పాకిస్థానీయుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఇదికాస్త అవిశ్వాస తీర్మానం వరకు వెళ్లింది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడయ్యాడు. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. షెహబాజ్ షరీఫ్ హయాంలో ద్రవ్యోల్బణానికి ముగింపు వస్తుందని అంతా ఆశించారు. కానీ.. సీన్ రివర్సైంది. ఆయన పాలన పక్కనబెట్టి.. రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కనీసం రంజాన్ వేడుకలు కూడా జరుపుకోలేని దుస్థితి ఏర్పడింది.