టర్కీలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్‌లో.. మంగళవారం వింత ఘటన జరిగింది. అప్పటిదాకా ఎండ దంచికొట్టింది. ఆ వెంటనే దట్టమైన మేఘాలు ఇస్తాంబుల్ నగరాన్ని కమ్మేశాయి. దీంతో దాదాపు 5 నిమిషాల పాటు ఇస్తాంబుల్ చీకట్లోకి వెళ్లింది. సడెన్ చీకటి కావడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో తెలియక.. ఆగమయ్యారు. దట్టమైన మేఘాలు కమ్ముకున్న తర్వాత భారీ వర్షం కురిసింది.
దాదాపు 10 కిలో మీటర్ల వెడల్పు ఉన్న దట్టమైన మేఘం కారణంగా.. నగరం చీకట్లోకి వెళ్లినట్టు అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా భారీ వర్షం కురిసింది. రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపోయాయి. ఇఫ్తార్ సమయానికి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంతటి వర్షాన్ని వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇటీవల ఇదే భారీ వర్షం అని అంటున్నారు.
వర్షం విషయం ఎలా ఉన్నా.. ఒక్కసారిగా భారీ మేఘం ఇస్తాంబుల్ నగరాన్ని కమ్మేయడంపై అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అపోకలిప్స్ అని.. చెడుకు సంకేతంగా భావిస్తున్నారు. ఇది భయంకరమైన భూకంపానికి కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. దీన్ని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. దట్టమైన మేఘాలు కమ్ముకున్నప్పుడు చీకటి కావడం కామన్ అని స్పష్టం చేస్తున్నారు.