పరారీలో ఉన్న ఖలీస్థాన్ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన కిరణ్‌దీప్ కౌర్ (28) అమృత్‌సర్ విమానాశ్రయంలో గురువారం పట్టుబడింది. ఆమె లండన్ విమానం ఎక్కేందుకు ప్రయత్నించినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. మార్చి 18న జలంధర్ జిల్లాలో చిక్కినట్టే చిక్కిన తప్పించుకున్న అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో అతడి భార్య కిరణ్‌దీప్‌ను పోలీసులు ప్రశ్నించారు.
కేవలం అమృత్‌పాల్ సింగ్ ఎక్కడున్నాడనేది కాదు.. ఖలీస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో అతడి భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అనేది ఆమెను ఆరా తీశారు. ధ్రువీకరించని నివేదికల ప్రకారం.. కిరణ్‌దీప్‌కు కూడా గతం గొప్పగానే ఉంది. వేర్పాటువాద సంస్థ బబ్బర్ ఖల్సాతో పరిచయాలు, భర్త అమృతపాల్ సింగ్ నేతృత్వంలోని వారిస్ పంజాబ్ దే కోసం నిధుల సేకరణ కూడా చేసినట్టు సమాచారం. ఆమె 2020లో యూకే పోలీసు రాడార్‌లోకి వచ్చినట్లు కూడా నివేదికలు ఉన్నాయి.
బ్రిటన్ పౌరురాలైన కిరణ్‌దీప్ యూకే పాస్‌పోర్ట్ హోల్డర్. ఆమెపై పంజాబ్‌లో కానీ, దేశంలో కానీ ఎలాంటి కేసులు లేవు. అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ యూకేలో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు. పంజాబ్ పోలీసులు లేదా కేంద్ర ఏజెన్సీల వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేవు. పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. మార్చిలో అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు.