చిత్తూరు డెయిరీ కార్మికుల జీత బకాయిలు వెంటనే చెల్లించాలని చిత్తూరు డెయిరీ కార్మిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రఖ్యాత గాంచిన చిత్తూరు డెయిరీని 2002 ఆగస్టు 31వ తేదీ కార్మికులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మూసేసి డెయిరీ కార్మికులను రోడ్డుపాలు చేశారని అన్నారు.
చిత్తూరు డెయిరీ మూతబడిన తర్వాత లిక్విడేటర్లుగా పనిచేసిన కొంతమంది అధికారులు ప్రభుత్వానికి, కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చి కార్మికులకు న్యాయం జరగకుండా నోరు కొట్టారని అన్నారు. స్వచ్ఛంద పదవి విరమణ చేయని కార్మికులకు జీతాలు ఇవ్వకుండా, వేరే డిపార్ట్మెంట్ వారు తీసుకుంటామని అంగీకరించినప్పటికీ వారిని రిలీవ్ చేయకుండా కార్మికుల జీవితాలతో ఆడుకున్నారని అన్నారు.
2006 సంవత్సరంలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు డెయిరీని ప్రారంభించాలని, కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చైర్మన్ గా హౌస్ కమిటీ వేశారు. ఆ కమిటీ చిత్తూరు డెయిరీ గురించి అధ్యయనం చేసి చిత్తూరు డెయిరీని పునః ప్రారంభించాలని, కార్మికులకు జీతాలు ఇవ్వాలని సిఫార్సు చేశారు.