శ్రీవారి దర్శనం నేరుగా పొందే అవకాశం భక్తులకు దక్కుతోంది. తిరుమల దర్శనానికి వెళుతున్న భక్తులకు శుభవార్త. కొండపై భక్తుల రద్దీ తగ్గిపోయింది. రెండు రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. వీకెండ్‌లో కూడా రద్దీ కనిపించలేదు. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం కేవలం ఒక్క కంపార్ట్‌మెంటులో మాత్రమే వేచి ఉన్నారు.. దీంతో టీటీడీ భక్తుల్ని నేరుగా దర్శనానికి అనుమతిస్తోంది. స్వామివారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. మరోవైపు సోమవారం తిరుమల వెంకన్నను 63,870 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. స్వామివారికి 27,480 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
సాధారణంగా వేసవికాలంలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో పాటూ వేసవి సెలవులు కూడా ఇస్తారు. దీంతో రద్దీ విపరీతంగా ఉంటుంది.. కానీ ఈసారి మాత్రం పరిస్థితి రివర్స్‌లో ఉంది. భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో.. కంపార్ట్‌మెంట్లలో వేచి చూడకుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే మరో రెండు మూడు రోజుల్లో భక్తుల రద్దీ పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. జులై నెలాఖరు వరకు రద్దీ కొనసాగుతుందని భావిస్తున్నారు. రద్దీని బట్టి ఏర్పాట్లు చేస్తామంటున్నారు.
మరోవైపు మే, జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేసింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. వీటితో పాటుగా మే, జూన్ నెలలకు సంబంధించిన వసతి గదులను కూడా ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
అంతేకాదు వేసవి సెలవుల్లో తిరుమల వచ్చే భక్తుల కోసం టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. జులై 15 వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్న టీటీడీ.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300/, వర్చువల్ సేవలు, టూరిజం కోటా దర్శన టికెట్లను తగ్గించింది. దర్శనం కోసం సామాన్య భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సామాన్య భక్తులకు గదులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
నడకమార్గం భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
తిరుమలలో ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకున్న వారు స్వయంగా వచ్చి ఏఆర్‌పి కౌంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ స్కానింగ్ చేసుకున్న తర్వాత వారికి గది కేటాయించినట్టుగా మెసేజ్ వచ్చాక సబ్ ఆఫీసుకు వెళ్లి గదులు పొందాల్సి ఉంటుంది. ఇతరులు ఎవరు వచ్చినా గదులు ఇవ్వరనే విషయాన్ని గమనించాలి. నిర్ణీత సమయమైన రెండు గంటల్లో గది తీసుకోకపోతే ఆ అద్దె తిరిగి ఇవ్వరు.. కేవలం కాషన్ డిపాజిట్ మాత్రమే తిరిగి చెల్లిస్తారు. అక్కడ కూడా ఫేస్ రికగ్నిషన్ విధానం అమలు చేస్తున్నారు.
క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నారు. తిరుమల ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కోసం చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు వేశారు. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసింది టీటీడీ. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాల్లో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.
తిరుమలలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్నారు. ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా భక్తులకు సేవలు అందిస్తున్నారు. భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు సిద్ధం చేశారు. భక్తుల రద్దీ పెరిగితే వారికి సేవలందించేందుకు దాదాపు 2,500 మంది శ్రీవారి సేవకులు ఉన్నారు.