వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి ఉన్న భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఈ మేరకు మంగళవారం పులివెందులలోని దస్తగిరి నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు.. ఆయన భద్రతకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని దస్తగిరికి సీబీఐ అధికారులు సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తమకు తెలియజేయాలని సీబీఐ అధికారులు సూచించారు.
మరో వైపు వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని, దర్యాప్తు సమయంలో ఆయన నుంచి ప్రశ్న, జవాబులను లిఖిత/ ప్రింట్ రూపంలో తీసుకోవాలని, ప్రశ్నావళిని ముందస్తుగా అందించాలని తెలంగాణ హైకోర్టు ఈ నెల 18న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం కొట్టివేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని వైఎస్ అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాదులు మంగళవారం ఉదయం హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఒకవేళ సీబీఐ అరెస్ట్ చేసినట్లయితే పిటిషన్‌పై విచారణ జరిపినప్పటికీ ప్రయోజనం ఉండదని వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీం కోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఇంకా అందలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతి లేకుండా విచారణ ఎలా కొనసాగిస్తామని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం మేరకే తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసులో ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వైఎస్ అనినాష్ రెడ్డిని సైతం త్వరలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వదంతులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పులివెందులలోని దస్తగిరి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు.. ఆయన భద్రతపై సమాచారాన్ని సేకరించారు. కాగా, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వాత ఏపీ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ఇటీవలే వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు భద్రతను పెంచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దస్తగిరి భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీసి.. అప్రమత్తం చేశారు.