వైఎస్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రులు కావడం కంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే వైఎస్సార్ ఆత్మ సంతోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చివరిసారి కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఏపీలోని 41 ఎంపీ సీట్లు సాధించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సందేశమిచ్చారని కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆంధప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అధ్యక్షతన విజయవాడలోని జింఖానా మైదానంలో నిన్న ‘జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ’ నిర్వహించారు.
ఈ సభలో పాల్గొన్న కేవీపీ మాట్లాడుతూ.. పార్లమెంటులో వైసీపీ, టీడీపీలకు 36 మంది సభ్యుల బలం ఉందని, అయినప్పటికీ మోదీ అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నించలేకపోతున్నందుకు ఓ తెలుగువాడిగా సిగ్గుపడుతున్నట్టు చెప్పారు. వైసీపీ, టీడీపీ, జనసేన అన్నీ బీజేపీ పక్షులేనని కేవీపీ ఆరోపించారు. అదానీ అక్రమాలపై వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని రాజ్యసభ సభ్యురాలు రంజిత్ రంజన్ డిమాండ్ చేశారు. ఏపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మెయప్పన్, కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, రఘువీరారెడ్డి, కొణతాల రామకృష్ణ తదితరులు ఈ సభకు హాజరయ్యారు.