ఏపీలో వైసీపీ రెబల్స్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నాయకత్వం తనదైనశైలీలోో ఝలక్ ఇస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. స్థానికంగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌బంకు దగ్గర నిలిపి ఉన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి ప్రచార వాహనాన్ని.. నెల్లూరుకు చెందిన సయ్యద్ షామొహిద్దీన్ తీసుకెళ్లారు. ఈ వాహనాన్ని 2019లో వాహనాన్ని కొనుగోలు చేశానని.. అప్పట్లో శ్రీకాంత్ అనే వ్యక్తికి అద్దె ప్రాతిపదికన ఇచ్చినట్లు షామొహిద్దీన్ అంటున్నారు.
కానీ శ్రీకాంత్ వాహనం తీసుకున్నప్పటి నుంచి అద్దె చెల్లించడం లేదన్నారు. అందుకే ఈ వాహనం స్వాధీనం చేసుకొని తీసుకెళుతున్నట్లు చెప్పారు. అయితే వైఎస్సార్ విగ్రహం కూడలిలో వాహనాన్ని పెట్రోల్‌బంకు నిర్వాహకులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. వాహనం షామొహిద్దీన్ పేరిట ఉండటంతో తీసుకెళ్లేందుకు అంగీకరించారు. దీంతో వాహనాన్ని నెల్లూరుకు తీసుకెళ్లారు.
సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కూడా ఎదురైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత గుంటూరులో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర ఉన్న ప్రచార వాహనాన్ని వైఎస్సార్‌సీపీ నేత సందీప్ తన అనుచరులతో వచ్చి తీసుకెళ్లారు. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రచార వాహనాన్ని 2019 ఎన్నికల సమయంలో తామంతా చందాలు వేసుకొని కొనుగోలు చేసి శ్రీదేవికి ఇచ్చినట్లు పోలీసులకు చెప్పారు. ఆ ప్రచార వాహనం తన సోదరి పేరుపై ఉందని చెప్పి.. సరైన పత్రాలు చూపడంతో వాహనాన్ని తీసుకువెళ్లేందుకు అనుమతించారు పోలీసులు.
అంతేకాదు ఎమ్మెల్యే శ్రీదేవి ఆఫీసులో ఉన్న వస్తువులు కూడా తమవేనని సందీప్ ఆఱోపించారు. ఆ వస్తువుల్ని ఆధారాలు ఇచ్చి తీసుకెళ్తామన్నారు. ఆమె పార్టీకి అన్యాయం చేశారని.. తామంతా చందాలు వేసుకుని మరీ గెలిపిస్తే నమ్మద్రోహం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఉదయగిరి ఎమ్మెల్యే వాహనాన్ని కూడా తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించారు. అయితే అనురాధకు వైఎస్సార్‌సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు (ఆనం రాం నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) ఓటు వేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినవారు కావడం విశేషం. వారిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. అయితే నియోజకవర్గంలో మేకపాటి, వైఎస్సార్‌సీపీ నేతలు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కూడా నడిచాయి. ఇప్పుడు ప్రచార వాహనం తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.