ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన కేరళలోని తిరువిల్వమలలో చోటు చేసుకుంది. తిరువిల్వమలకు చెందిన ఆదిత్యశ్రీ (8 ఏళ్లు) స్థానికంగా ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. సోమవారం (ఏప్రిల్ 24) రాత్రి 10.30 గంటల సమయంలో ఆ చిన్నారి తన తల్లిదండ్రుల ఫోన్ తీసుకొని వీడియోలు చూస్తోంది. ఇంతలో ఆ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. చిన్నారి ముఖంపైనే ఫోన్ పేలిపోవడంతో తీవ్రంగా గాయపడి మరణించిందని పోలీసులు తెలిపారు.
సాధారణంగా సెల్‌ఫోన్లను ఛార్జింగ్‌లో పెట్టి అలాగే ఫోన్ మాట్లాడితే పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోలు చూసినా, ఇంటర్నెట్ వాడినా.. కొన్నిసార్లు ఫోన్లు పేలిపోయే ముప్పు ఉంటుంది. బ్యాటరీ పాడైపోయినా.. ఫోన్లను అలాగే వాడుతుంటే పేలిపోయే ప్రమాదం ఉంటుంది. గంటల తరబడి ఇంటర్నెట్ వాడినా.. హీటెక్కి పేలిపోయే ముప్పు ఉంటుంది. తిరువిల్వమల ఘటనలో ఫోన్ ఏ కారణంగా పేలిందనే విషయం తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిపోయి 68 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ముఖంపైనే ఫోన్ పేలిపోవడంతో అతడి ముఖం, ఇతర శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. ఘటన జరిగిన సమయంలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగానే అతడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
బాధితుడు బరోద్ (68) తన స్నేహితుడితో కలిసి ఒక ప్రాంతాన్ని సందర్శించాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే, బరోద్ నుంచి ఫోన్ కాల్‌కు ఎంతకీ సమాధానం రాకపోవడంతో స్నేహితుడు అతడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లి చూడగా.. అతడు శరీర పైభాగాలు తీవ్రంగా దెబ్బతిని విగతజీవిగా పడి ఉన్నాడు. మృతదేహం పక్కన మొబైల్ ఫోన్ ముక్కలు కూడా ఉన్నాయి. ఆ ఇంట్లో మరే ఇతర పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు.