కేరళలో తొలి వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ -కాసర్‌గడ్ మధ్య 11 జిల్లాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణం సాగుతుంది. అనంతరం తిరువనంతపురం నగరంలోని రూ.3,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. అలాగే, దేశంలోనే తొలి వాటర్ మెట్రో రవాణా ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. సహజ వనరులు సమృద్ధిగా ఉండే కేరళలో నీటి వనరులకు కొదవలేదు. దీంతో ఈ రాష్ట్రానికి వాటర్ మెట్రో ఎంతో ఉపయోగపడుతుందని భావించి..ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇది కొచ్చి నగరానికి చాలా ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్ట్ అని అధికారులు చెబుతున్నారు.
వాటర్ మెట్రో ప్రయాణంలో సౌకర్యం, సౌలభ్యం, భద్రత, సమయపాలన, విశ్వసనీయత, పర్యావరణ అనుకూలత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సులభమైన ప్రయాణంతో పాటు ముఖ్యంగా కాలుష్యం ఉండబోదని భావిస్తున్నారు. ఇక్కడ వాటర్ మెట్రో సక్సెస్ అయితే.. అవకాశం ఇతర నగరాల్లో దీన్ని ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సర్వే కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ సైన్స్ పార్క్‌కు మోదీ శంకుస్థాపన చేశారు.
కేరళలో రెండు రోజుల పర్యటనలో భాగంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం తిరువనంతపురంలో ఘన స్వాగతం లభించింది. తిరువనంతపురం విమానాశ్రయం నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్ వరకు ఆయన ప్రయాణం రోడ్‌షో లాగా సాగింది. మోదీ కోసం వేలాది మంది గంటల కొద్దీ రహదారికి ఇరువైపులా నిరీక్షించారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు అశ్వికదళం ముందుగా దాటినప్పుడు పూల వర్షం కురిపించారు.