దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగస్టర్, రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ సింగ్.. నేడు (ఏప్రిల్ 26న) జైలు నుంచి విడుదలయ్యారు. బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో.. ఆయన జైలు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమమైంది. తెలుగు ఐఏఎస్ అధికారి అయిన జి.కృష్ణయ్య 1994లో హత్యకు గురి కాగా.. ఈ కేసులో ఇప్పటికే 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న ఆనంద్ మోహన్.. సత్ప్రవర్తన కారణంగా విడుదలయ్యారు.
హత్యకు గురయ్యే సమయానికి కృష్ణయ్య గోపాల్‌గంజ్ జిల్లా మెజిస్ట్రేట్‌గా పని చేస్తున్నారు. ఆయన్ను కారులో నుంచి బయటకు లాగి.. దారుణంగా హతమార్చారు. కృష్ణయ్య హత్యకు గురై దాదాపు 30 ఏళ్లు అవుతున్నప్పటికీ.. తరాలపాటు యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో ఆయన ఒకరు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని నిరుపేద దళిత కుటుంబంలో కృష్ణయ్య జన్మించారు. ఆయన తండ్రి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. మొదట్లో కృష్ణయ్య కూడా కూలీ పనులకు వెళ్లేవారు. ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఆయన హాస్టల్‌లో ఉండి చదువుకున్నారు. సమాజం గురించి ఆలోచన ఉన్న ఆయన జర్నలిజంలోకి అడుగుపెట్టారు. తర్వాత లెక్చరర్‌గా పని చేశారు. కొంత కాలం క్లర్క్‌గానూ పని చేశారు. ఎన్నో కష్టాలను దాటుకుంటూ వచ్చిన ఆయన 1985లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరారు.
కృష్ణయ్యకు బిహార్లో పోస్టింగ్ వచ్చింది. ప్రజలు, ముఖ్యంగా పేదల సమస్యలను తెలుసుకోవడం ప్రతి రోజూ ఆయన వారిని కలిసేవారు. దీంతో ఆయన పేదలకు బాగా దగ్గరయ్యారు. ఆయన మొదటి పోస్టింగ్ వెస్ట్ చంపారన్. ఆ ప్రాంతం బందిపోట్లు, కిడ్నాపర్లకు పెట్టింది పేరు. అయినా సరే కృష్ణయ్య మంచి పనితీరు కనబర్చారు. స్థానిక భూస్వాముల నుంచి వ్యతిరేకత వచ్చినా సరే.. భూ సంస్కరణల విషయంలో తనదైన శైలిలో పని చేశారు. ఓ కలెక్టర్ ఎవరి ఇంట్లోనైనా భోజనం చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి.. ఆయన ఎప్పుడూ తన వెంట లంచ్ బాక్స్ తీసుకెళ్లేవారు.
1994లో కృష్ణయ్యను గోపాల్‌గంజ్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. అండర్ వరల్డ్ డాన్ చోటన్ శుక్లా హత్యకు గురయ్యాడు. 1994 డిసెంబర్ 5న శుక్లా అంత్యక్రియల్లో ఆనంద్ మోహన్ పాల్గొన్నాడు. ఆనంద్ మోహన్ పిలుపు మేరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. అదే సమయంలో కృష్ణయ్య ఓ సమావేశంలో పాల్గొని గోపాల్‌గంజ్‌కు తిరిగి వెళ్తుండగా.. కారుపై దాడి చేసి బాడీ గార్డ్‌ను బయటకు లాగేశారు. అయినా సరే డ్రైవర్ కారు ఆపకుండా పోనిచ్చే ప్రయత్నం చేశాడు. కానీ కృష్ణయ్య మాత్రం బాడీగార్డ్‌ను కాపాడే ఉద్దేశంతో కారును ఆపమన్నారు. డ్రైవర్ వారించినా సరే ఒప్పుకోలేదు. కారులో నుంచి బయటకు దిగిన కృష్ణయ్యపై వారు రాళ్లతో దాడి చేసి చంపేశారు. హత్యకు గురయ్యే నాటికి కృష్ణయ్య 35 ఏళ్లు కాగా.. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
ఆనంద్ మోహన్ ప్రేరేపించడంతోనే కృష్ణయ్య హత్య జరిగిందని చెబుతారు. దీంతో 2007లో కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. దేశ చరిత్రలో మరణ శిక్ష పడిన తొలి రాజకీయ నాయకుడు అతడే. కానీ తర్వాత పాట్నా కోర్టు మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఆనంద్ మోహన్ తండ్రి రామ్ బహదూర్ సింగ్ స్వాతంత్య్ర సమరయోధుడు కావడం గమనార్హం.
ఏప్రిల్ 10న బిహార్ ప్రభుత్వం జైలు మాన్యువల్‌లోని రూల్ 481లో మార్పులు చేసింది. దీంతో మోహన్ విడుదలకు మార్గం సుగమమైంది. 14 నుంచి 20 ఏళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన 26 మంది ఖైదీల విడుదల నితీశ్ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే పెరోల్ మీద విడుదలైన ఆనంద్ మోహన్.. తన కొడుకు చేతన్ ఆనంద్ ఎంగేజ్‌మెంట్ వేడుకలో పాల్గొంటుండగా.. జైలు నుంచి రిలీజ్ అవుతున్న విషయం తెలిసింది. చేతన్ ఆనంద్ ప్రస్తుతం ఆర్జేడీ నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
రాజ్‌పుత్‌ల ఓట్ల కోసమే ఆనంద్ మోహన్‌ను విడుదల చేస్తున్నారని హత్యకు గురైన ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య ఉమ ఆరోపించారు. ఓ క్రిమినల్ విడుదల చేయాలని బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాజానిక తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆమె ఆవేదన వయక్తం చేశారు.