రైతులు కానీ, రైతు కూలీలు కానీ, అందరం కేవలం వ్యవసాయంపైనే ఆధారపడితే పేదవారిగానే మిగిలిపోతామని నాడు తాను చెప్పానని, కానీ దానిని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఇదిలావుంటే చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారంటూ వైఎస్ హయాం నుంచి ఆయనపై విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా, చంద్రబాబు ఈ అంశంపై స్పందించారు. నాడు తాను ఏమన్నది వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. "నేను వ్యవసాయం దండగ అన్నానని ఒకప్పుడు నాపై విమర్శలు చేశారు. కావాలనే దాన్ని ప్రతిరోజూ ఊతపదంలా వాడారు. ఆ రోజున నేను చెప్పింది ఏంటంటే... రైతులు కానీ, రైతు కూలీలు కానీ, అందరం కేవలం వ్యవసాయంపైనే ఆధారపడితే పేదవారిగానే మిగిలిపోతామని అన్నాను. భవిష్యత్తు అనేది ఒక నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడే అవకాశం వచ్చింది... మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరిని ఐటీ చదివించండి, ఇంకొకరిని వ్వవసాయం చేయించండి... వారి భవిష్యత్ చూస్తే మీకే అర్థమవుతుంది అన్నాను.
వ్యవసాయదారుడు వ్యవసాయంలోనే ఉండిపోకుండా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు పోవాలి. అందుకు ఉదాహరణ నేనే. మా నాన్న నన్ను వ్యవసాయం చేసుకోమని అనుంటే రెండు మూడెకరాలు సాగు చేసి, కష్టపడి ఇంకో పదెకరాలు కొనేవాడ్ని. కానీ నేను అంచెలంచెలుగా ఎదిగి, రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలుగు జాతికి గుర్తింపు తీసుకువచ్చే పరిస్థితికి వచ్చాను. నైపుణ్యం ఆధారంగా చేసుకుంటే అలాంటి అవకాశాలు ఉంటాయని నాడు చెప్పాను. ఇవాళ ఇక్కడున్న రైతులు, రైతు కూలీల పిల్లలు అమెరికా వెళ్లి అక్కడి వారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆ రోజున వీళ్లు నన్ను తిడతారని ఆగిపోయుంటే ఇదంతా జరిగేదా?" అని చంద్రబాబు ప్రశ్నించారు.