చర్చి మతపెద్ద బోధనలతో ప్రభావితమై కఠిన ఉపవాసంతో కడుపు మాడ్చుకుని పదుల సంఖ్యలో జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు. మూఢభక్తితో బలవన్మరణానికి పాల్పడిన వారిలో ముక్కుపచ్చలారని చిన్నారులు కూడా ఉండటం బాధాకరం. అత్యంత హృదయవిదారకమైన ఈ ఘటన ఆఫ్రికా దేశం కెన్యాలో వెలుగులోకి వచ్చింది. కిల్ఫీ ప్రావిన్స్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో తవ్వే కొద్దీ మృతదేహాలు గుట్టలుగా బయటపడుతున్నాయని పోలీసులు వెల్లడించారు. షాకహోలా అటవీ ప్రాంతంలో గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్ బోధకుడు మాకెంజీ ఎన్ థాంగే ఈ దారుణానికి కారణమని తెలిపారు.
ప్రార్థన కోసం చర్చికి వచ్చే వారిని మూఢభక్తి వైపు ప్రోత్సహించి ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు. జీసస్‌ను కలుసుకోవాలని అనుకుంటున్న వారు ఆకలితో అలమటించి మరణించాలని పిలుపునిచ్చిన మాకెంజీ.. ఇలా చనిపోయినవారిని పాతిపెడితే పరలోకానికి చేరుకుని, ప్రభువును కలుసుకుంటారని నమ్మబలికాడు. ఇలా, ఫాస్టర్ మాకెంజీ బోధనలకు ప్రభావితమైన డజన్లు కొద్దీ భక్తులు కఠిన ఉపవాసం చేసి బలవన్మరణం పొందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా ఉండటం బాధాకరం.
ఉపవాసంతో చనిపోయినవారి మృతదేహాలను అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు. దీంతో పోలీసులు మాకెంజీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందిత ఫాస్టర్ వెల్లడించిన వివరాల ఆధారంగా.. షాకహోలా ప్రాంతంలో పోలీసులు తవ్వకాలు జరిపారు. ఏప్రిల్ నెల 11న తొలుత 11 మృతదేహాలు బయటపడగా.. ఆదివారం మరో 26 మృతదేహాలను వెలికి తీశారు. అలాగే, ఫాస్టర్ సూచన మేరకు కఠిన ఉపవాసం చేస్తోన్న మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల రాకతో వీరంతా అటవీ ప్రాంతంలో దాక్కుని మరీ ఉపవాసం కొనసాగించడం గమనార్హం. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, మృతదేహాల కోసం పోలీసులు తవ్వకాలు జరుపుతూనే.. ఆ ప్రాంతంలో ఇంకా ఉపవాసం చేస్తున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. గుడ్‌న్యూస్ చర్చి ప్రాంగణంలో ఈ నెల ప్రారంభంలో ఉపవాసం చేస్తోన్న 15 మందిని పోలీసులు రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో నలుగురు ఆస్పత్రికి వెళ్లేలోగా ప్రాణాలు ఒదిలారు.
పోలీస్ కస్టడీలో ఉన్న ఫాస్టర్ మాత్రం తాను ఎవరినీ ఆత్మహత్యకు ప్రేరేపించలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు, 2019లోనే చర్చిని మూసేశానని, ఈ మరణాలతో తనకు సంబంధం లేదని వాదిస్తున్నాడు. ఈ క్రమంలో 47 మంది ఉపవాసంతోనే చనిపోయారని నిరూపించేందుకు మృతదేహాల నుంచి డీఎన్ఏ నమూనాలను అధికారులు సేకరించారు. మరోవైపు, ఫాస్టర్ మాకెంజీపై గతంలో కూడా పలు ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు. ఇద్దరు చిన్నారుల మరణానికి కారణమయ్యాడనే కేసులో అరెస్టయిన ఆయన.. జరిమానా చెల్లించి ఈ కేసు నుంచి బయటపడ్డాడని వివరించారు.