ఆనంద్ మోహన్ విడుదల కావడం.. కృష్ణయ్యను రెండోసారి హత్య చేయడమే అని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీహార్ ఐఏఎస్ అసోసియేషన్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు బీహార్‌లో ఏ ఐఏఎస్ అధికారి అయినా.. తన ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తారా అని అసదుద్దీన్ ఓవైసీ నిలదీశారు.
1994 డిసెంబర్ 5న 37 ఏళ్ల వయసులో దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను హత్య చేశారని అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణయ్య కూలి పని చేస్తూ.. చదువుకున్నారని వివరించారు. కృష్ణయ్య కుటుంబానికి తాను అండగా ఉంటానని.. ఆనంద్ మోహన్ విడుదల కావడంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీహార్ ప్రభుత్వం జైలు నిబంధనలలో మార్పులు చేసి.. ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమం చేసిందనే విమర్శలు ఉన్నాయి.
దీనిపై ఒవైసీ కూడా పలు ప్రశ్నలు సంధించారు. బీహార్‌లో మరోసారి సన్‌లైట్, రణ్‌వీర్ సేన రాబోతోందా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఘాటు విమర్శలు చేశారు. గతంలో బిల్కీలపై అత్యాచారం చేసిన వారిని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయగా.. ఇప్పుడు బీహార్ ప్రభుత్వం మరో దోషిని విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏం సామాజిక న్యాయం? అని ప్రశ్నించారు. బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన నిందితులు విడుదలైనప్పుడు.. బీజేపీ నాయకులెవ్వరూ వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు.
1994లో బీహార్‌లో చోటన్ శుక్లా అనే నేత హత్యకు గురయ్యారు. ఆ సమయంలో.. చోటన్ శుక్లా మృతదేహంతో.. అతని మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. దీంట్లో ఆనంద్ మోహన్ కూడా పాల్గొన్నారు. పోలీసులు కావాలనే ఎన్‌కౌంటర్ చేశారని ఆనంద్ మోహన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. బీహార్ రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు జరిగాయి. పోలీసుల వాహనాలు ధ్వంసం చేశారు. అలా అల్లర్లు జరుగుతున్న సమయంలో.. జి కృష్ణయ్య గోపాల్‌గంజ్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.
అల్లర్లు జరుగుతున్నప్పుడు కృష్ణయ్య గోపాల్‌గంజ్ నుంచి హాజీపూర్‌కి వెళ్తున్నారు. ఆయన కారును ఆందోళనకారులు చూశారు. ఆ కార్‌పై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. ఈ ఘటనలో కృష్ణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఆనంద్ మోహన్ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. 2007లో దిగువ కోర్టు ఆనంద్‌కు మరణ శిక్ష విధించింది. ఆ తర్వాత పాట్నా హైకోర్టు ఆ తీర్పుని సవరించి.. జీవిత ఖైదు విధించింది. ఆ శిక్ష పూర్తి కాకుండానే ఆయన బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.