అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను మాజీ అధ్యక్షుడు, ఆయన రాజకీయ డొనాల్డ్ ట్రంప్ హేళన చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. న్యూహాంప్‌షైర్‌లో ఇటీవల ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్... ఈ సందర్భంగా బైడెన్‌ను అనుకరిస్తూ హేళన చేశారు. తన ప్రసంగం మధ్యలో అచ్చం బైడెన్‌లా మాట్లాడాల్సింది మర్చిపోయినట్టు నటించి.. ఆ తరువాత స్టేజీ దిగేందుకు ఎటు వెళ్లాలో తెలీక తికమక పడుతూ తన మద్దతుదారులను నవ్వించారు. చివరకు ఎడమవైపు చేయి చూపిస్తూ అటు వైపు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ట్రంప్ నడవడం బైడెన్‌ను గుర్తుకుతెచ్చింది. దీంతో, సభలో ఆయన మద్దతుదారుల పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన రెండు రోజులకే ట్రంప్ ఆయనను హేళన చేసేలా అనుకరించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. కాగా, ఇతర విషయాలతోపాటు అక్రమవలసలు, మూడో ప్రపంచ యుద్ధాన్ని నిరోధించే ఏకైక అభ్యర్థి తానేనని, బైడెన్ హయాంలో మొత్తం ప్రపంచానికి అమెరికాను డంపింగ్ యార్డ్‌గా మార్చారని ట్రంప్ ఆరోపించారు. దేశంలో తెలివితక్కువ నేతలు పాలిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.
మరోవైపు, వచ్చే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధమవుతోన్న పలు న్యాయపరమైన సమస్యలు ట్రంప్‌ను చుట్టుముడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బైడెన్‌పై ట్రంప్ పూర్తి ఆధిక్యత కనబరుస్తారని ఆయన అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ట్రంప్ సభకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మరోవైపు, అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి కేసులో విచారణకు మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ జ్యూరీ ముందు హాజరయ్యారు. దీనికి ముందు పోర్న్‌స్టార్‌లో అనైతిక ఒప్పందానికి సంబంధించిన కేసులో కోర్టు విచారణకు హాజరైన ట్రంప్.. న్యాయమూర్తి ముందు లొంగిపోయారు.