గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున గంటన్నర వ్యవధిలో నేపాల్‌ను రెండు భూకంపాలు వణికించాయి. తొలుత బజూరా జిల్లా దహల్‌కోట్‌లో రాత్రి 11.58 గంటలకు 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం మరో గంటన్నర వ్యవధిలో శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటలకు 5.9 తీవ్రతతో మరో భూకంపం చోటుచేసుకున్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే, భూకంప నష్టం గురించి వివరాలు తెలియరాలేదు. ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం నమోదుకాలేదని అధికారులు తెలిపారు. భూకంపంతో భయకంపితులైన జనం.. ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
ఇటీవల కాలంలో నేపాల్‌లో తరుచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ప్రభావంతో ఢిల్లీతోపాటు రాజస్థాన్‌లోనూ ప్రకంపనలు సంభవించాయి. నేపాల్‌లోని సుదూర్ పశ్చిమ్ ప్రావిన్సుల్లోని బజురా జిల్లాలో భూకంప కేంద్రం గుర్తించారు. భూకంపం ధాటికి కొండపై నుంచి బండరాయి దొర్లుకుంటూ వచ్చి మీదపడగా ఒక మహిళ చనిపోయింది. పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుత భూకంపాలు కూడా బజురా జిల్లాలోనే చోటుచేసుకున్నాయి.
ఇదిలావుంటే 2015, ఏప్రిల్ 25న నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెంట్రల్ నేపాల్ ఖాట్మండులో సంభవించిన ఈ భూకంపం కారణంగా 9,000 మంది మరణించారు. అనేక వేల మంది గాయపడ్డారు. ఖాట్మండు, ఇతర సమీప పట్టణాలలో 600,000 కంటే ఎక్కువ నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. మధ్య, తూర్పు నేపాల్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని గంగా మైదానంలో ఎక్కువ భాగం, వాయువ్య బంగ్లాదేశ్, టిబెట్ పీఠభూమి, పశ్చిమ భూటాన్ దక్షిణ భాగాలపై ఈ భూకంపం ప్రభావం చూపింది. 1932 తర్వాత నేపాల్‌లో సంభవించిన అతి భారీ భూకంపం ఇదే.