డ్రగ్స్ అక్రమ రవాణాలో దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తి తంగరాజు సుప్పయ్య (46)ను సింగపూర్ అధికారులు ఉరితీశారు. ఛాంగీ సెంట్రల్ జైలులో ఉరిశిక్షను అమలు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్షమాభిక్ష పెట్టాలని దోషి కుటుంబం, మానవహక్కుల సంఘాలు, ఐక్యరాజ్యసమితి చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ కోర్టు తీర్పును అమలుచేశారు. మాదక ద్రవ్యాల రవాణాకు సహకరించాడన్న ఆరోపణలు రుజువు అవడంతో బుధవారం మరణశిక్ష అమలు చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పట్టుబడిన తంగరాజుకు 2018 అక్టోబరు 9న సింగ్‌పూర్ కోర్టు మరణశిక్ష విధించింది.
2014లో మరో ఇద్దరుతో కలిసి కిలోకుపైగా గంజాయిని తరలిస్తూ పోలీసులకు తంగరాజు పట్టుబట్టాడు. వైద్యపరీక్షల్లో తంగరాజు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. అతను డ్రగ్స్‌తో ఎప్పుడూ సంబంధంలోకి రానప్పటికీ తనకు చెందిన రెండు ఫోన్ నంబర్ల ద్వారా ఇతర వ్యక్తులతో సంప్రదింపులు జరిపినట్టు న్యాయమూర్తి తీర్పు చెప్పడంతో అతనికి ఉరిశిక్ష విధించబడింది.
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నార్కోటిక్స్ చట్టాలున్న సింగ్‌పూర్‌లో డ్రగ్స్ అక్రమరవాణాకు పాల్పడితే మరణశిక్ష తప్పనిసరి. గతేడాది ఇటువంటి నేరాలకు పాల్పడిన 11 మందికి ఇలా మరణదండన విధించారు. తాజాగా ఆరు నెలల తర్వాత అక్కడ మరణశిక్ష అమలు చేయడం ఇదే మొదటిసారి. కాగా, తంగరాజు మరణ శిక్షపై ఐరాస మానవహక్కుల సంఘం ఆసియా డైరెక్టర్ ఫిల్ రాబర్ట్‌సన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది దారుణమైందని, అమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.
తంగరాజుకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు కేవలం మిగిలిన ఇద్దరు వ్యక్తుల ఫోన్‌లలోని నెంబర్లే అని, చాలావరకు సందర్భానుసారంగా ఉన్నాయని హక్కుల కార్యకర్తలు చెప్పారు. తంగరాజును అధికారులు ప్రశ్నించినప్పుడు లాయర్‌ను అనుమతించలేదని ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, మరణశిక్ష అమలుకు ముందు, ఐరాస మానవ హక్కుల అధికారి శిక్షను అత్యవసరంగా పునఃపరిశీలించాలని అధికారులను కోరారు.
‘సరైన ప్రక్రియ, న్యాయమైన విచారణ హామీల గురించి మాకు ఆందోళనలు ఉన్నాయి’ అని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ ప్రతినిధి రవినా షమ్‌దసాని అన్నారు. ఆ ఆందోళనలను తోసిపుచ్చిన సింగ్‌పూర్ అధికారులు.. తంగరాజుకు సరైన ప్రక్రియ, న్యాయసహాయం అందించామని పేర్కొన్నారు. మరోవైపు, బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ బ్లాగ్ పోస్టుపై సింగపూర్ హోం మంత్రిత్వశాఖ తీవ్రంగా స్పందించింది. తంగరాజు శిక్షపై నిరసన వ్యక్తం చేసిన బ్రాన్సన్.. తమ దేశ న్యాయమూర్తులను, న్యాయ విధానాన్ని అవమానపరుస్తున్నారని మండిపడింది.
డ్రగ్స్ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించడంపై నిర్వహించిన సర్వేలో 87 శాతం ప్రజలు ఆమోదాన్ని తెలిపారని సింగ్‌పూర్ మంత్రి కే షణ్ముగం అన్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడినవారికి మరణశిక్షను కేవలం సింగపూర్‌లోనే కాదని ప్రపంచంలోనే అతిపెద్ద మూడు దేశాలైన చైనా, భారత్, అమెరికా కూడా అమలుచేస్తున్నాని షణ్ముగం తెలిపారు.