గత కొద్ది రోజులుగా దాదాపు రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. మే నెలలో ఉదయాన్నే పలుచోట్ల మంచు కురవడం విస్తుగొలుపుతోంది. ఇక కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్ల కింద ఉండరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.