ఇటీవల న్యాయస్థానాల నుంచి పలు అంశాల్లో పరాభావం ఎదుర్కొన్న వైసీపీ సర్కార్ కు తాజాగా సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పువచ్చింది. సిట్ నియామకంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు కొట్టేసింది. గత టీడీపీ ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు విధానాలలో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఆటంకాలు తొలిగిపోయాయి. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సీబీఐబి , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ పిటిషన్‌ను మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని సుప్రీం ఏపీ హైకోర్టుకు సూచించింది. ఈ కేసు అపరిపక్వ స్థాయిలో జోక్యం చేసుకొని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చుతున్నామని.. హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.. సిట్‌పై హైకోర్టు స్టేను ఎత్తేసింది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలపై సిట్ దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఆ సిట్ నియామకంపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.. దీంతో హైకోర్టు స్టే విధించింది. వెంటనే ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్టేను సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ప్రభుత్వం తెచ్చింది. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదనలు వినిపించారు.
ఏపీ ప్రభుత్వ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి అని విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని.. జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని అభిప్రాయపడింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ సర్కార్ సిట్ దర్యాప్తును మొదలు పెట్టనుంది.