ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు అడుగు పెడితే చాలు హెలికాప్టర్ లో ప్రయాణిస్తారని, అలాంటప్పుడు హైవే మీద తిరిగే వాహనాలు ఎలా అడ్డు అవుతాయో అర్థం కావడం లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయనగరం జిల్లాలోని బోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన కోసం సీఎం జగన్ గాల్లో ప్రయాణించి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద, అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారి పైన వాహనాలు నిలిపివేయడం విచిత్రంగా ఉందన్నారు.
వాహనాలు ఇలా నిలిపివేయడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మీదకు వస్తే పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం, గాల్లో సీఎం విమానం పోతుంటే కింద రోడ్డు మీద వాహనాలు ఆపివేయడం చూస్తుంటే జగన్ లో రోజురోజుకు అభద్రతాభావం ఎంతలా పెరిగిపోతుందో తెలుస్తోందన్నారు. పోలీసుల అత్యుత్సాహానికి పరాకాష్టగా భోగాపురానికి అటు టు 150 కిలో మీటర్ల మేర దూరంలో హైవేపై వాహనాలు ఆపివేశారని, దీంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారన్నారు.