విజయనగరం జిల్లా, వేపాడ మండలంలో పులిదాడిలో మూడు మేకలు మృతిచెందిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... . చామలాపల్లి గ్రామ పంచాయతీ శివారు వెంకయ్యపాలెం గ్రామానికి చెందిన గిరిజన రైతులు కసరాజు రమణ, ముమ్మి రామోజీ, తుమ్మి సత్యనారాయణ మారికకొండపై మారిక రహదారిని ఆనుకుని ఉన్న చాపరాయి సమీపాన చిన్నమామిడిచెట్టు ప్రాంతానికి మేకలను మేపేందుకు బుధవారం తోలుకువెళ్లారు. మధ్యాహ్నం మేకలు మేత మేస్తుండగా ఒక్కసారిగా పులి దాడి చేసి ఐదు మేకల ను తీవ్రంగా గాయపర్చిందని, ఈ ఘటనలో రమణ, సత్యనారాయణ, రామోజీలకు చెందిన ఒక్కో మేక మృతి చెందగా మరో రెండు మేకలు తీవ్రంగా గాయ పడ్డాయని బాధిత రైతులు వాపోయారు. పులి దాడిని గుర్తించిన మేకల కాపలాదారులు భయంతో గ్రామానికి చేరుకుని మరి కొంతమందిని తోడు తీసుకువెళ్లి పరిసర ప్రాంతంలో గాలించగా పులిజాడ కనిపించలేదని, కానీ పులి అడుగులు గుర్తించామని తెలిపారు. దీనిపై అటవీశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, తమను ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.