తిరుపతి రాయల్‌నగర్‌కు చెందిన మనోజ్ బెంగళూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సుష్మ తిరుపతిలో ఉంటున్నారు. వీరికి పది, తొమ్మిదేళ్ల కుమార్తెలు, రెండున్నర సంవత్సరాల ప్రణవ్ నారాయణ అనే కుమారుడున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో సుష్మ తన ముగ్గురు పిల్లలతోపాటు సోదరుడి కుమారుడిని కూడా తీసుకుని బుధవారం మధ్యాహ్నం జూపార్కుకు వెళ్లారు. ఓ చేత్తో ప్రణవ్ నారాయణను, మరో చేత్తో మేనల్లుడిని పట్టుకుని జూపార్కులో నడిచి వెళుతున్నారు. ఈ సమయంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనం ఒకటి.. అమ్మ చేయి పట్టుకుని రోడ్డు పక్కన నడిచి వెళుతున్న ప్రణవ్ నారాయణను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆపై వాహన చక్రాలు కూడా చిన్నారిపైకి ఎక్కేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ తల్లి నిశ్చేష్టురాలైంది. దీన్ని గమనించిన జూపార్కు ఉద్యోగి ఒకరు ఆ బాలుడిని హుటాహుటిన రుయాస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బిడ్డ చనిపోయాడని తెలియడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవ్వరి తరమూ కాలేదు. విషయం తెలుసుకున్న ఎంఆర్‌పల్లె ఎస్‌ఐ వినోద్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బ్యాటరీ వాహన డ్రైవర్ మునిరాజ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.