ఆయేషా మీరా హత్య కేసులో తనను అక్రమంగా ఇరికించారని నిందితుడిగా ఉన్న సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొన్నేళ్ల పాటు జైల్లో గడిపి నిర్దోషిగా బయటకు వచ్చిన సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయేషాను చంపింది ఎవరనే విషయాన్ని ఆమె తల్లి ఎప్పటి నుంచో చెపుతున్నారని... కానీ, పోలీసులు ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు తనను నాలుగు సార్లు విచారించిందని, ఇప్పుడు మరోసారి విచారించబోతోందని, సీబీఐ విచారణకు సహకరిస్తానని చెప్పాడు.
ఆయేషా మీరా హత్య జరిగి ఇప్పటికి దాదాపు 15 ఏళ్లు గడుస్తున్నా నిందితులను పట్టుకోలేదని సత్యంబాబు అసహనం వ్యక్తం చేశాడు. ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా విడుదలయ్యే సమయంలో తనకు నష్ట పరిహారం, ఇల్లు, పొలం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు అవి తనకు అందలేదని చెప్పాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా న్యాయం జరగలేదని తెలిపాడు.