రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు విద్యార్థుల ఖాతాల్లో ఇంత వరకు విద్యాదీవెన, వసతిదీవెన నిధులు జమ కాక ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కడప నగరంలోని లా కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రుల అకౌంటులో వసతి దీవెన, విద్యాదీవెన నిధులు జమ కాలేదని అన్నారు. రాష్ట్రంలో ఇడుపుల పాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు విద్యాదీవెన, వసతిదీవెన నిధులు అందక ఆందోళన చెందుతున్నారని అన్నారు. డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. హాస్టళ్లలో కూడా వసతులు నిలిపివేశారన్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే తప్ప తాము ఏమీ చేయలేమని కళాశాల యాజమాన్యాలు చేతులెత్తేశాయని అన్నారు. కళాశాలల్లో చేర్చుకున్నప్పుడు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని నమ్మబలికి ఇప్పుడు చెల్లించకపోవడం విద్యార్థులను మోసం చేయడమేనన్నారు. నాలుగువేల మంది జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. గత మూడేళ్లకు గాను లక్ష రూపాయలు చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. సోమవారం లోపు ప్రభుత్వం తల్లిదండ్రులు ఖాతాల్లో విద్యాదీవెన, వసతిదీవెన నిధులు జమ చేయకుంటే మంగళవారం విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకుని టీడీపీ ఆధ్వర్యంలో ఇడుపులపాయ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో యూనివర్శిటీలో పనిచేస్తున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందికి మూడునెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు చెప్పే గురువులకే జీతాలు చెల్లించకుంటే విద్యావ్యవస్థ తీరు ఎలాఉందో స్పష్టం అవుతోందన్నారు.