ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2023ని ఏలూరు జిల్లా కేంద్రంలోని మూడుసెంటర్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 15నుంచి 19 వరకు ఇంజనీరింగ్, 22,23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో రోజుకి రెండు షిఫ్ట్‌లలో నిర్వహిస్తారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండు షిఫ్ట్‌లలో ఈ పరీక్షలు ఉంటాయి. ఏలూరులోని సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, మెయిన్ బైపాస్‌లోని దుగ్గిరాల పరిది ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వట్లూరు సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకు 4500 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు 1800 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తెలిపారు.