టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇస్తున్నారు. జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర నేటితో 93వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం కర్నూలు జిల్లాలోని ఎస్‌టీబీసీ గ్రౌండ్ విడిది కేంద్రం నుంచి 93వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ను మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు కలిశారు. ఎస్సీ వర్గీకరణ అమలుచేసి, మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. లోకేష్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అమలు చేసిన 27సంక్షేమ పథకాలను రద్దుచేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.33,504 కోట్లను జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.