మణిపూర్‌లో మైతేయి కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదా ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు.. అందరినీ సంప్రదిస్తామని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మే 3 నుంచి జరిగిన ఘటనల పై అందరి వాదనలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని.. ఎలాంటి ఆందోళనలకు గురి కావొద్దని సూచించారు.
మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 54 మంది మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. 23 వేల మందికి పైగా నిర్వాసితులు సైనిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఇతర పనుల మీద మణిపూర్ వచ్చిన వారు తిరిగి వారి వారి సొంత ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. అటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది.
మే 3న కుకీ గిరిజన సమూహం నిరసన కవాతు నిర్వహించింది. దీంట్లో గిరిజనేతరులు మైతేయి కమ్యూనిటీతో ఘర్షణలు జరిగాయి. ఆ తరువాత అశాంతి చెలరేగింది. రెండు రోజుల పాటు చురచంద్ పూర్, ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాల్లో కార్లు, భవనాలు తగలబెట్టారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. కర్ఫ్వూ విధించారు. దీంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది.
మణిపూర్ ముఖ్యమంత్రికి హోం మంత్రిత్వ శాఖ కొత్తగా నియమించిన భద్రతా సలహాదారు కుల్దీ సింగ్ తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. మే 3న హింస చెలరేగిన పలు ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూ ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు. 'మేము ఇప్పటివరకు 9 చోట్ల సమావేశాలు నిర్వహించాము. ప్రజలు హింసను ఆశ్రయించకుండా చూసేందుకు సంఘం నాయకులు మాకు సహాయం చేశారు' అని కుల్దీప్ సింగ్ వివరించారు.