తమిళనాడులో ఓ అమ్మాయి అద్భుతం చేసింది. ఇంటర్ సెకండియర్ (క్లాస్ 12)లో 600లకు 600 మార్కులు సాధించి, ఔరా అనిపించింది. చాలా మంది విద్యార్థులూ సాధిస్తున్నారుగా.. ఇది పెద్ద విశేషమా అనుకుంటే పొరపాటే..! నిరుపేద కుటుంబంలో పుట్టి, గవర్నమెంట్ విద్యా సంస్థలో చదివి.. ఈ ఘనత సాధించింది. అది కూడా ఎకనామిక్స్ విభాగంలో. ఈ అమ్మాయి పేరు ఎస్ నందిని. తల్లిదండ్రులు రోజూ కూలీ పనులు చేస్తే గానీ ఇల్లు గడవదు. కుమార్తెను చదివించడం తమకు భారమే అయినా.. ఆమె ఇష్టం మేరకు రెక్కలు ముక్కలు చేసుకొని చదివించారు. వారి కష్టాన్ని ఆమె వృథా కానివ్వలేదు. గర్వపడేలా చేసింది.
దిండిగల్‌కు చెందిన నందిని.. అన్నామలైయర్ మిల్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ ప్రభుత్వ స్కూల్‌లో చదివింది. తమిళం, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్.. మొత్తం ఆరు పేపర్లలో ఆమె 100కు 100 మార్కులు సాధించింది. తమిళనాడు రాష్ట్ర 12వ తరగతి బోర్డ్ పరీక్షలు సోమవారం (మే 8) విడుదలయ్యాయి.
అన్ని సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు వస్తాయని తాను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదని నందిని చెప్పింది. ఫలితాలు వెలువడిన అనంతరం తన తల్లిదండ్రులు భానుప్రియ, శరవణ కుమార్‌తో కలిసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంది. తన టీచర్ల వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకుంది. నందిని సాధించిన ఘనత పట్ల ఆమె టీచర్లు కూడా హర్షం వ్యక్తం చేశారు.
‘మా నాన్న దినసరి కూలీ. అయినా నన్ను చదువుకోకుండా ఆపాలని ఏనాడూ ప్రయత్నించలేదు. నేను ఈ స్థితికి రావడానికి ఆయన కష్టమే కారణం. నా విద్యే నా సంపద అని ఆయన నాకు ఎప్పుడూ చెబుతుంటారు. నా కలలను సాకారం చేసుకునేలా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు’ అని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నందిని చెప్పింది. ఎల్‌కేజీ నుంచి తన ఉపాధ్యాయులు తనకు నిరంతరం మద్దతుగా నిలిచారని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయడం తనకు సంతోషంగా ఉందని నందిని చెప్పింది.