కేరళలోని మలప్పురంలో ఆదివారం సాయంత్రం జరిగిన పడవ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఏడుగురు చిన్నారులు సహా 22 మంది మృతిచెందారు. అయితే, వీరిలో ఒకే కుటుంబంలోని 12 మంది జలసమాధికావడం అత్యంత బాధాకరం. ప్రమాదానికి గురైన డబుల్ డెక్కర్ బోటును వెలికితీసిన అధికారులు.. జేసీబీ సాయంతో ఒడ్డుకు చేర్చారు. తీరం నుంచి అర కిలోమీటరు దూరం వెళ్లగానే బోటు ఓ పక్కకు ఒరిగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులంతా నీట మునిగినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగితే... రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యంగా చేపట్టడం వల్లే ప్రాణనష్టం అధికంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితుల కేకలు విన్న స్థానికులు పడవ బోల్తా పడిన విషయం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం అగ్నిమాపక దళం, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నా వెలుతురు లేకపోవడం వల్ల సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. బోటుకు లైసెన్స్ లేదని, సామర్థ్యం కన్నా ఎక్కువ ముందే ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
ఈ దుర్ఘటనలో ఆటోడ్రైవర్ తానూర్ కునుమ్మల్ సైతలవి కుటుంబానికి చెందిన 12 మంది చనిపోయారు. వీరిలో ఎనిమిది నెలల చిన్నారితో పాటు ఏడుగురు పిల్లలే కావడం అత్యంత విషాదకరం. వేసవి సెలవులు కావడంతో పిల్లలంతా విహారయాత్రకు వచ్చిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అసలు తాను పడవ ఎక్కొద్దని చెప్పానని, అలా చేసుంటే ఇంత ఘోరం జరిగేది కాదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ పడవ ఎక్కొద్దని చెప్పాను.. అయినా వారు వెళ్లారు. భార్యకు ఫోన్ చేయగా అరుపులు, కేకలు వినిపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికి జరగరానిది జరిగిపోయింది’ అని కున్నుమ్మల్ సైతలవి కన్నీటిపర్యంతమయ్యాడు.