సిస్ హిట్ లిస్టులో తన పేరు కూడా ఉందని.. తనను చంపేస్తామని ఐసిస్ ఇప్పటికే ప్రకటించిందని.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ పై ఒవైసీ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ లో సివిల్ వార్ జరుగుతుంటే.. బెంగళూరులో ప్రధాని మోదీ రోడ్ షో చేస్తున్నారని ఒవైసీ విమర్శించారు. ది కేరళ స్టోరీ సినిమా ప్రమోషన్ కోసమే మోదీ బెంగళూరులో రోడ్ షో చేస్తున్నారని ఆరోపించారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు లో ఒవైసీ సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక అంశాల పై ఘాటుగా స్పందించారు. బెంగళూరులో రెండు రోజుల పాటు మోదీ చేపట్టిన ర్యాలీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ బెంగళూరు లో రెండు రోజుల మెగా ర్యాలీ నిర్వహించారు. శనివారం బెంగళూరులోని 13 నియోజకవర్గాల పరిధిలో 26 కిలో మీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఆదివారం 10 కిలో మీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు.
ప్రధాని మోదీ ర్యాలీలో లక్షలాది మంది కాషాయ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బెంగళూరు లోని పలు ప్రాంతాల్లో మోదీ బహిరంగ సభలు నిర్వహించారు. మోదీ రెండు రోజుల ర్యాలీపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మోదీ ర్యాలీ కారణంగా బెంగళూరు లో ట్రాఫిక్ జామ్ అయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. మరో వైపు కర్ణాటక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో చివరి రోజు అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
కర్ణాటకలో మే 10న ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో తొలిసారిగా సీనియర్ సిటిజన్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రతను పెంచనున్నారు. గత కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే.. కొద్ది రోజుల్లోనే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను కలుపుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.