'ది కేరళ స్టోరీ'ని నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర సచివాలయంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాశ్మీర్ ఫైల్స్ తరహాలో బెంగాల్‌పై సినిమాకు బీజేపీ నిధులు సమకూరుస్తోందని మమతా బెనర్జీ ఆరోపించిన కొద్ది నిమిషాలకే.. ఈ ప్రకటన వెలువడింది. ఇటు ది కేరళ స్టోరీ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాపై పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో నడుస్తున్న స్క్రీన్‌ల నుంచి ది కేరళ స్టోరీ సినిమాను తొలగించేలా చూడాలని.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి దీదీ ఆదేశించారు. బెంగాల్‌లో శాంతిని నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వ్యాఖ్యానించారు. నేరాలు, హింసను ద్వేషించేలా ఉన్న వాటిని బెంగాల్‌లోకి అస్సలు అనుమతించబోమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు, ప్రజల స్పందన సరిగా లేకపోవడంతో.. తమిళనాడు అంతటా ఈ సినిమా ప్రదర్శనను నిలిపేశారు. బెంగాల్ సీఎం మమతా కూడా స్టాలిన్ బాటలోనే నడిచారు.
అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కేరళలో మతపరమైన బోధన, హిందూ, క్రైస్తవ స్త్రీలను రాడికల్ ఇస్లామిక్ మతాధికారులు ఎలా టార్గెట్ చేస్తున్నారు అనే దానిపై ఈ సినిమా తీశారు. మహిళలు ఇస్లాం మతంలోకి మార్చబడ్డారని.. తరువాత ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సిరియా వంటి దేశాలకు వారిని తరలించారని ఈ సినిమా చూపించారు. ఈ సినిమాను బీజేపీ సహా.. పలు పార్టీలు సమర్థిస్తున్నాయి. పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.