‘‘ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ఒక్కసారి గట్టిగా ప్రయత్నం చేయండి. సచివాలయాల్లో దరఖాస్తు చేయడం అయినా, అది ఏ ప్లాట్‌ఫాం అయినా సరే ఒకసారి గట్టిగా ప్రయత్నం చేద్దాం. అయినా మనవైపున న్యాయం ఉండి.. మనకు న్యాయం జరగని పరిస్థితులు కనిపించినా, ప్రయత్నం చేసినా సత్ఫలితాలు రాని పరిస్థితులు కనిపించినా.. అప్పుడు 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేసి నేరుగా జగనన్నకే ఫోన్ కొట్టండి’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా వినతుల పరిష్కారమే జగనన్నకు చెబుదాం కార్యక్రమ లక్ష్యమన్నారు. సమస్యల పరిష్కారం చూపుతూ ఎప్పటికప్పుడు అర్జీదారులకు సమాచారం అందిస్తామన్నారు. స్పందన కార్యక్రమం వల్ల ఇటువంటి సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపించాం. దానికి ఇంకా మెరుగులు దిద్దుతూ ఈరోజు జగనన్నకు చెబుదాం అని ముఖ్యమంత్రి పేరు కూడా జత చేస్తూ ఈ కార్యక్రమం మెరుగ్గా చేయాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకువేశామని సీఎం వైయస్ జగన్ అన్నారు.