చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. కర్నూలు జిల్లా, దొర్నిపాడు మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో దయానందరావు ఆధ్వర్యంలో గురువారం వైసీపీ ఎంపీటీసీ రాధ, సుబ్బారావు, సాంబయ్య, వేమూరి సాయి, కంటు ఆదినారాయణ, బత్తిని హరిబాబుతో పాటు మరో 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌నాయుడు, భూమా జగత్‌విఖ్యాతరెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అఖిలప్రియ మాట్లాడుతూ ఒక్కచాన్స్ ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదని అన్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గ్రామాల్లో సమస్యలను తెలుసుకుంటూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు, భయాబ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలకు భూమా అండగా ఉంటుందని, వైసీపీ నాయకుల తాటాకు చప్పుల్లకు భయపడవద్దని అన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ మేనేజర్ కొత్తపల్లె సురేంద్ర, చౌడయ్య, మాజీ సొసైటీ అధ్యక్షుడు సిద్ధి సత్యం, దొర్నిపాడు మాజీ ప్రెసిడెంట్ సిద్ధి నారాయణ, చాకరాజువేముల మాజీ ఆలయ ధర్మకర్త లింగుట్ల వెంకట్‌నాయుడు, కంటు ఆదినారాయణ, దూదెకుల ప్రసాదు ఉన్నారు.