దేశంలో అంతిమంగా గెలిచేది, నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ రాజ్యాంగమేనని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రజలను, విపక్షాలను, పౌర సంఘాలను ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై గొంతెత్తకుండా చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1ను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. జగన్ వంటి నాయకులు వస్తారని నాడే ఊహించారని, అందుకే భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారని వెల్లడించారు. ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని, అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైందని చంద్రబాబు పేర్కొన్నారు.