రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టేనని జగన్ చెప్పారు. ‘‘సంక్షేమ పథకాలు వద్దని, రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పిస్తున్నారు. పొరపాటు జరిగితే రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి ఉండదు. పేదలను ఏపీ నుంచి తరిమేస్తారు’’ అని ఆరోపించారు. సూటు బూటు వేసుకున్న జోకర్లు సంక్షేమ పథకాలను తప్పుపడుతున్నారని విమర్శించారు.
నెల్లూరు జిల్లాలోని కావలిలో చుక్కల భూములపై నిషేధం ఎత్తివేస్తూ రైతులకు హక్కు పత్రాలను సీఎం జగన్ ఈ రోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినట్టు జగన్ చెప్పారు. వేల మంది రైతులకు విముక్తి కల్పించామన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2,06,171 ఎకరాల్లోని చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం దక్కిందన్నారు.
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. రైతులను కోలుకోలేని దెబ్బకొట్టారన్నారు. చుక్కల భూములపై ఇక నుంచి రైతులకు అన్ని హక్కులు దక్కుతాయని, బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చని చెప్పారు.