సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 10వ, 12వ తరగతి ఫలితాలు వచ్చాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థులందరికీ మార్కు షీట్‌లు, ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలు డిజిలాకర్‌లో అందుబాటులో ఉంటాయి. పరీక్షకు హాజరైన వారు తమ సిబిఎస్‌ఈ ఫలితాల డిజిలాకర్ ఖాతాలను యాక్టివేట్ చేయడం ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. శుక్రవారం ఉదయం 12వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి ఫలితాలు వచ్చాయి.
విద్యార్థులు, తల్లిదండ్రులు తమ డిజిలాకర్ ఖాతాలను యాక్టివేట్ చేయడానికి ఆరు అంకెల సెక్యూరిటీ పిన్ అవసరం అవుతుంది. డిజి లాకర్ తో పాటు పరీక్షా సంగమ్ నుండి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నెంబర్లు, స్కూల్ నెంబర్లతో ఈ ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఎవరైనా తమ డిజిలాకర్ సెక్యూరిటీ పిన్ ను పొందనట్లయితే ఇందుకోసం వారు తమ పాఠశాలలను సంప్రదించవలసి ఉంటుంది. 12వ తరగతిలో ఉత్తీర్ణత 87.33 శాతంగా ఉండగా, పదో తరగతిలో 93.12 శాతంగా ఉంది.