తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుడుతూ.. పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీలోని సీనియర్ నేతలంతా తరలి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఈ ఏడాది మహానాడు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
ఈ నెల 27న 15 వేల మంది ప్రతినిధులతో మహానాడు, మరుసటి రోజు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని 15 లక్షల మందితో నిర్వహిస్తామని చెప్పారు. మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా 15 తీర్మానాలు ప్రవేశపెడతామని తెలిపారు. మహానాడు కోసం టీడీపీ నేతలు సిద్ధమవుతుండగా.. వైసీపీ మాత్రం కవ్వింపు చర్యలకు దిగుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సిటీతో పాటు శివారు ప్రాంతాలలో టీడీపీ హోర్డింగ్ లు ఏర్పాటు చేయకుండా ఎంపీ మార్గాని భరత్ ఆటంకాలు సృష్టిస్తున్నారని చెప్పారు.
హోర్డింగులన్నీ ఆయన బ్లాక్ చేశారని వివరించారు. కవ్వింపు చర్యలు ఆపకుంటే ప్రజలు వైసీపీపై తిరగబడతారని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ఢిల్లీకి చాటిచెబితే, జగన్ మాత్రం ఢిల్లీ పెద్దల కాళ్లపైన పడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు. జగన్ పాలన పోవాలి.. మళ్లీ చంద్రబాబు పాలన రావాలి అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.